మన దేశంలో ఎలాగైతే నేరాలు పెరిగిపోతున్నాయో.. మానవత్వం కూడా రానురాను అలాగే చచ్చిపోతోంది. కళ్ల ముందే విలవిలలాడుతున్నా.. సహాయం చేయడానికి ఒక్కరు కూడా ముందుకు రాని దుర్భర సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ప్రాణాపాయ స్థితిలో ఉన్నా సరే.. ఫోన్లు తీసి వీడియోలు తీస్తారే తప్ప చేయూతనందించడానికి మాత్రం ముందుకు రారు. తామూ ఏదైనా సమస్యల్లో చిక్కుకుంటామని భయమో లేదా నిర్లక్ష్యమో తెలీదు కానీ.. మానవత్వం మాత్రం మంటగలిసిపోతోంది. ఇందుకు తాజా ఉదంతమే ప్రత్యక్ష సాక్ష్యం. అత్యాచారానికి గురై, అర్థనగ్నంగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ బాలిక తనని ఆదుకోమ్మని వేడుకుంటే.. ఒక్కరూ కూడా ఆ అమ్మాయి బాధని పట్టించుకోని హేయమైన సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
ఆ వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయిన్ నగరంలో కొందరు రాక్షసులు 12 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి, దండి ఆశ్రమం సమీపంలో వదిలేసి వెళ్లారు. చిన్న అమ్మాయి అనే కనికరం కూడా లేకుండా.. దుండగులు ఆ బాలికపై పైశాచికత్వం ప్రదర్శించారు. పాపం ఆ బాలిక.. వాళ్లను ఎదురించలేకపోయింది. ఆ దుర్మార్గులు వదిలి వెళ్లిపోయిన తర్వాత.. రక్తస్రావంతో అర్ధనగ్నంగానే ఇంటి బాట పట్టింది. ఆమె పరిస్థితిని చూసి కూడా ఎవ్వరూ ఆమెని ఆదుకోలేదు. ఒక చోట తనకు ఇంటి బయట ఓ వ్యక్తి కనిపించడంతో సహాయం చేయమని అర్థించింది. కానీ.. అతడు తిరస్కరించడంతో ఆ బాలిక అక్కడి నుంచి వెళ్లిపోయింది. మనసుల్ని కదిలించే ఈ హృదయవిదారక దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మనుషులు మరీ ఇంత రాతి మనసులు కలిగి ఉంటారా? అని ఈ వీడియో చూశాక అనిపించకమానదు. చివరికి ఆ బాలికను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని తేలింది.
మరోవైపు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దోషులను త్వరగా గుర్తించి, పట్టుకోవడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశామని సీనియర్ పోలీస్ అధికారి సచిన్ శర్మ తెలిపారు. మైనర్‌కు నిర్వహించిన వైద్య పరీక్షలో అత్యాచారం జరిగినట్టు నిర్ధారించబడిందని ఆయన పేర్కొన్నారు. అటు.. ఈ కేసుకి సంబంధించి ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ అమ్మాయి ఎక్కడి నుంచో వచ్చిందో సరిగ్గా చెప్పలేకపోయింది. అయితే.. ఆమె ఉచ్ఛారణ చూసి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కి చెందిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై ఎన్‌సీపీసీఆర్ చైర్‌పర్సన్ ప్రియాంక్ కనూంగో మాట్లాడుతూ.. చాలా గంటల పాటు మైనర్‌కు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఇది సమాజంలోని చీకటి కోణాన్ని వెల్లడిస్తోందని మండిపడ్డారు