Bharatha Sakthi

కిన్నెరసాని ఉపనదిలో దొంగలు పడ్డారు.!

Bharath Sakthi 08/01/2025
Updated 2025/01/08 at 6:23 PM

భద్రాద్రి జిల్లా బ్యూరో జనవరి 06 (భారతశక్తి):
ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్ గా పిలవబడే మీడియాలో కొందరూ (ప్రధాన పత్రికలు) బూర్గంపాడు మండలంలో అక్రమాలతో రాజ్యమేలుతున్నారు. అవినీతి, అక్రమాలను వెలికితీసి, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా సామాజిక బాధ్యతగా వ్యవహరించాల్సిన జర్నలిస్టులు కోట్లు సంపాదించేలనే లక్ష్యంతో అక్రమాలకు తెరలేపుతూ అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రధాన పత్రికలలో, శాటిలైట్ ఛానెల్ లో వర్కింగ్ జర్నలిస్టులుగా చలామణి అవుతూ, మీడియా అనే ముసుగు వేసుకున్న కొందరూ జర్నలిస్టులు, అధికార పార్టీ నేతలు, మాజీ జెడ్పిటిసి, రెవెన్యూశాఖ సిబ్బంది సహాయంతో గత నెల రోజులుగా సహజ సంపదను అక్రమంగా ఎల్లలు దాటిస్తున్నారు. తిలపాపం తలపిడికెడు అన్న చందంగా మీడియా, అధికార పార్టీ నాయకులు, మాజీ జెడ్పీటీసీ, రెవెన్యూశాఖ సిబ్బంది కలిసి నిషారాత్రిలో ఇసుకను లారీలతో డిమాండ్ ఉన్న ప్రాంతాలకు తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలంలోని సోంపల్లి, బుడ్డగూడెం, ఉప్పుసాక, నాగారం గ్రామాలోని సరిహద్దుల్లో ఉన్న కిన్నెరసాని ఉపనది నుండి అక్రమంగా ఇసుకను భారీ యంత్రాల సహాయంతో టిప్పర్లలో లోడు చేసి డిమాండ్ ఉన్న ప్రాంతాలకు తరలించి లక్షలు తమఖాతాలో వేసుకుంటున్నారు.

సోంపల్లి గ్రామంలో పాత్రికేయులు అక్రమంగా ర్యాంపు

బూర్గంపాడు మండల పరిధిలోని కిన్నెసాని పరివాహక ప్రాంతమైన సోంపల్లి గ్రామంలో రెవెన్యూ సిబ్బంది, అధికార పార్టీకి చెందిన నాయకులు, ప్రధాన పత్రికలలో పనిచేసే కొందరూ పాత్రికేయులు కలిసి నెల రోజులుగా అక్రమంగా ఇసుక ర్యాంపు ను ఏర్పాటు చేసుకొని జేసిబి యంత్రాలతో టిప్పర్లల్లో లోడుచేసి నిరంతరాయంగా డిమాండ్ ఉన్న ప్రాంతాలకు తరలించి లక్షలు గడిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన అధికారులు కంచె చేను మేసిన చందంగా అధికార పార్టీ నాయకులు, ప్రధాన పత్రికలలో పనిచేసే కొందరూ పాత్రికేయులు కలిసి అక్రమ ఇసుక రవాణా చేస్తుంటే చూసే వారు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు, ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, అవినీతి, అక్రమాలను వెలికితీయాల్సిన ప్రధాన పత్రికల జర్నలిస్టులు కొందరూ మీడియా ముసుగులో అక్రమ ఇసుక దందా చేస్తుంటే స్థానిక ప్రజానీకం ఇండ్లలో దుమ్ము, దూళి, పడి రహదారులు పాడవుతున్నాయనే ఆవేదనను వ్యక్తం చేస్తూ.. బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్ధం గాక లోలోపల మదన పడుతున్నారు.

మాజీ జెడ్పిటిసి అక్రమ ఇసుక దందా..

బుడ్డగూడెం గ్రామంలో అధికార పార్టీకి చెందిన మాజీ జెడ్పిటిసి,అతని అనుచరులు పట్టపగలే కిన్నెరసాని ఉపనది లో జేసిబి పెట్టి ట్రాక్టర్లు ద్వారా ఇసుకను మైదాన ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల ప్రక్కన డంపు చేసి రాత్రి లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. బుడ్డగూడెం గ్రామస్థులను ప్రసన్నం చేసుకోని, ప్రశ్నించకుండా గిరిజనులకు గోవులను కోసుకోవడాని దానంగా ఇచ్చి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు. మాజీ జెడ్పిటిసి చేసే అక్రమ దందాలకు అధికారుల సపోర్టు పుష్కలంగా ఉండడంతో ప్రశ్నించాల్సిన గొంతుకలు మూగబోతున్నాయి. అర్ధరాత్రి 2 రెండు గంటల నుండి అక్రమ ఇసుక టిప్పర్లను బుడ్డగూడెం జంక్షన్ నుండి జింకలగూడెం మీదుగా సీతారమా ప్రాజెక్టు వెంబడి రవాణా చేస్తూ చెక్ పోస్ట్ ను దాటిస్తున్నారు. ప్రధాన పత్రికల పాత్రికేయులు కావడంతో ఎవరూ నోరు మెదపడం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు.

ఒకరిని చూసి మరోకరు ఇసుక దందా.!

మండలంలోని ప్రధాన పత్రికల పాత్రికేయులు చేస్తున్న అక్రమ ఇసుక దందాను చూసి అదే మండలానికి చెందిన శాటిలైట్ ఛానెల్, యుట్యూబ్ ఛానెల్, పిడిఎఫ్ పత్రికలలో పనిచేసే జర్నలిస్టులు కిన్నెరసాని ఉపనది పరివాహక గ్రామాలైన నాగారం, ఉప్పుసాక ప్రాంతాల్లో అక్రమ ఇసుక దందా తగ్గేదెలా అంటూ వారి పంథాను జులుంపిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న బూర్గంపాడు మండల రెవెన్యూ అధికారులు, అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు, మాజీ జెడ్పిటిసి, ప్రధాన పత్రికల జర్నలిస్టులు, శాటిలైట్ ఛానెల్, యూట్యూబ్, పిడిఎఫ్ పత్రికలలో పనిచేసే మీడియా మిత్రులు అడ్డుఅదుపు లేకుండా చేసే అక్రమ ఇసుక దందాను అరికట్టాలని జిల్లా కలెక్టర్, మైనింగ్ అధికారులను స్థానిక ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

Share this Article