న్యూఢల్లీి, అక్టోబరు 12
దేశంలోని యూనివర్సీటీలు, కళాశాలలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కీలక ఆదేశాలు జారీచేసింది. విద్యాసంస్థలన్నీ ఇకపై తమ వెబ్‌సైట్‌లలో ఫీజులు, రిఫండ్ పాలసీ, హాస్టల్ వసతులు, స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్స్, ర్యాంకింగ్స్, అక్రిడిటేషన్ వంటి వివరాలను తప్పనిసరిగా పొందుపరచాల్సిందేనని స్పష్టం చేసింది. ఉన్నత విద్యాసంస్థల్లో పారదర్శకతను పెంచేలా, విద్యార్థులు తప్పుదోవపట్టకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు తమ వెబ్‌సైట్‌లలో తప్పనిసరిగా ఉంచాల్సిన కంటెంట్‌కు సంబంధించి ఓ చెక్ లిస్ట్‌ను విడుదల చేసింది. కొన్ని విశ్వవిద్యాలయాలు తమ వెబ్‌సైట్లలో ప్రాథమిక సమాచారాన్ని కూడా పేర్కొనకపోవడం, కొన్ని వెబ్‌సైట్లు సరిగా పనిచేయకపోవడం, అప్‌డేట్ చేయకపోవడం వంటి అంశాలను గమనించిన తర్వాతే ఈ చర్యలు చేపట్టినట్టు యూజీసీ ఛైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్ కుమార్ తెలిపారు.యూనివర్సిటీలు, కళాశాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం అందుబాటులో లేకపోతే విద్యార్థులకు చాలా అసౌకర్యంగా ఉంటుందని జగదీశ్ కుమార్ అన్నారు. అందువల్లే విద్యాసంస్థలు వెబ్‌సైట్లలో పొందుపరచాల్సిన అంశాలతో చెక్‌లిస్ట్‌ను తయారు చేసినట్టు తెలిపారు.యూజీసీ రూపొందించినఈ చెక్‌లిస్ట్‌లో ఉన్నత విద్యాసంస్థలు/వర్సిటీల పేటెంట్ల వివరాలు, విదేశీ, పరిశ్రమలతో సహకారం, అంతర్గత నాణ్యత భరోసా కేంద్రం, అంతర్గత ఫిర్యాదుల కమిటీ, హెల్ప్‌లైన్‌తో కూడిన యాంటీ ర్యాగింగ్ సెల్, సమాన అవకాశాలకు సంబంధించిన విభాగం, పూర్వ విద్యార్థుల సంఘం, అంబుడ్స్‌మన్, అనుబంధ కళాశాలలు, ఆఫ్‌షోర్ క్యాంపస్‌లు, విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కార కమిటీ, సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విభాగం, పౌర సంబంధాల విభాగం, అప్పిలేట్ అథారిటీ తదితర వివరాలతో యూజీసీ చెక్‌లిస్ట్ రూపొందించింది.
Leave a comment