ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన ఇరువురు సభ్యులు బండి పార్థసారథి రెడ్డి, దీవకొండ దామోదర్ రావులు శుక్రవారం పార్లమెంట్ భవన్ లో ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, కె. ఆర్. సురేష్ రెడ్డి, వెంకటేష్ నేత లతో కలిసి కొత్త ఎంపీలు రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎంపీలందరితో వెంకయ్య నాయుడు కొద్ది సేపు ముచ్చటించారు. అనంతరం ఎంపీలంతా కలిసి కొత్త సభ్యులకు లోక్ సభ, రాజ్యసభ లతో పాటు పార్లమెంటు సెంట్రల్ హాలును చూపించి.. అక్కడ గ్రూప్ ఫొటో దిగారు. పార్లమెంట్ వెలుపల ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ఎంపీలందరూ.. తెలంగాణ అమరులను స్మరించుకుని, జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో పలువురు తెలంగాణ నేతలు పాల్గొన్నారు.