Bharatha Sakthi

ఇదెక్కడి న్యాయం…

Bharath Sakthi 30/06/2023
Updated 2023/06/30 at 6:05 PM

హైదరాబాద్, జూన్ 30:
ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారులు, నాయకులు, మంత్రుల పొంతన లేని సమాధానాల వల్ల జర్నలిస్టులు రోడ్దేక్కే పరిస్థితికి దారి తీస్తోంది. ఇన్నేళ్ళు సుప్రీం కోర్టులో ఉన్న విచారణలను బూచిగా చూపిన వాళ్ళు కోర్టు తీర్పు వచ్చి పదినెలలు అవుతున్న దాని అమలుకు రోజుకో మాట చెప్పడాన్ని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌజింగ్ సొసైటీ సభ్యులు తీవ్రంగా గర్హిస్తున్నారు. అంతేకాక, ప్రభుత్వ వైఖరి వల్ల సొసైటి సభ్యులు తమకు న్యాయం చేయించాలని రాజకీయ పార్టీలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. హైదరాబాదు, ఢిల్లీలో పనిచేస్తున్న జర్నలిస్టులు 11 వందల మందికి 2008లో గత ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి నిజాంపేట్ 32 ఎకరాలు, పేట్ బషీరాబాదులో 38 ఎకరాలు జి.ఓ.నెం.424 2008 వ సంవత్సరంలో మొత్తం 70 ఎకరాల భూమిని కేటాయించగా అప్పటి మార్కెటు రేటు ప్రకారం 12.33 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగినదని సభ్యులు వివరించారు. 2017లో సుప్పీం కోర్టు మాకు ఇంటీరియం ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అందులో సొసైటీకి స్థలాలు అప్పగించాలని, వాటిని సొసైటి అభివృద్ది చేసుకోవచ్చని స్ఫష్టంగా తెలిపింది. అప్పుడు ప్రభుత్వం వారు నిజాంపేట్ లోని 32 ఎకరాలను హెచ్.ఎం.డి.ఏ. ద్వార సొసైటికి అప్పగించడం జరిగింది. పేట్ బషీరాబాద్ స్థలం ఇవ్వకుండా ప్రభుత్వం ఆపింది. ఈ విషయం పై సొసైటి నాయకులూ, సభ్యులు ప్రస్తావించినప్పుడు తుది తీర్పు వచ్చిన తర్వాత ఇస్తామంటూ ప్రభుత్వంలోని పెద్దలు మరియు అధికారులు దాటవేస్తు వచ్చారు. గత ఆగస్టు నెలలో సుప్రీం తుది తీర్పు వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వ పెద్దలు రోజుకో మాట చెబుతూ కాలయాపన చేస్తున్నారే తప్ప పేట్ బషీరాబాద్ స్థలాన్ని సొసైటికి అపగించదలేదని సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పక్క జిల్లాల్లో జర్నలిస్టులకు తాజాగా స్థలాలు కేటాయిస్తూ, ఎప్పుడో 15 ఏళ్ల కిందట సొసైటికి కేటాయించిన భూమిని ఎందుకు అప్పగించలేక పోతున్నారని ప్రశ్నిస్తున్నారు. పేట్ బషీరాబాద్ స్థలం జర్నలిస్టులకే అప్పజెప్పాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినా పట్టించుకోక పోవడం సమస్యను మరింత జటిలం చేస్తోంది. ఇదిలా ఉంటే, సొసైటికి చెందిన కొందరు సభ్యులు తమ సమస్యలను ఇటు ప్రభుత్వానికి, అటు అధికారులకు తెలియజేసే క్రమంలో ఉద్యమ బాట ఎన్నుకుంటున్నారు. వచ్చేనెల మొదటి వారంలో సభ్యులు సమావేశమై కార్యాచరణ రూపొందించడానికి వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జర్నలిస్టుల న్యాయమైన సమస్యను పరిష్కరిస్తే బాగుంటుందని జర్నలిస్టు సంఘాలు, రాజకీయ పక్షాలు అభిప్రాయపడుతున్నాయి.

Share this Article