Bharatha Sakthi

ఆ స్థలాలకు మీరే యజమానులుః హైకోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ చంద్రకుమార్‌

Bharath Sakthi 02/07/2023
Updated 2023/07/02 at 8:51 PM

సంపూర్ణ న్యాయ సహకారం అందిస్తాంః సీనియర్‌ అడ్వకేట్‌​ రామచందర్‌ రావు
కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేస్తాంః వ్యవస్థాపక సభ్యుడు పీ వీ రమణారావు

సుందరయ్య విజ్ఞాన కేంద్రంః సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిజాంపేట్‌, పేట్‌ బషీరాబాద్‌ లోని 70 ఎకరాలు జేఎన్‌జే సొసైటీకే చెందుతుందని, ఈ భూమి కోసం సభ్యులందరూ డబ్బులు చెల్లించినందున ఆ భూమికి జేఎన్‌జే సొసైటీ సభ్యులే యజమానులని హైకోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ చంద్రకుమార్‌​ స్పష్టం చేశారు. ఆదివారం టీమ్‌ జేఎన్‌జే ఆధ్వర్యంలో జరిగిన జవహర్‌ లాల్‌ నెహ్రూ జర్నలిస్టుల మ్యూచువల్‌ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ సభ్యుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఆదివారం ఉదయం పది గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫౌండర్‌ మెంబర్‌శ్రీ పీవీ రమణారావు అధ్యక్షతన జేఎన్‌జే సొసైటీ సభ్యుల కీలక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా హైకోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ చంద్రకుమార్‌, మాజీ ఎమ్మెల్సీ – సుప్రీంకోర్టు సీనియర్‌ అడ్వకేట్‌ ఎన్‌ రామ చంద్రరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు ‍ప్రకారం జేఎన్‌జే సొసైటీ సభ్యులకు మాత్రమే ఈ స్థలాలు చెందుతాయని, ఇందులో మధ్యవర్తిత్వం అవసరమే లేదని స్పష్టంగా పేర్కొంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తి స్థాయిలో అధ్యయనం చేసినట్లయితే ఈ స్థలాలు జేఎన్‌జే సొసైటీకి అప్పగించాల్సిందేనని ఖరాకండిగా చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన అప్పటి మార్కెట్‌ ధర ప్రకారంగా రూ.12.33 కోట్లు చెల్లించి సొసైటీ సభ్యులు కొనుగోలు చేయడం, దానిపైనే సుప్రీం తుదితీర్పు అనే ఆయుధాలతో భూమిని ఎలాగైనా స్వాధీనం చేసుకునే హక్కు కలిగించిందని జస్టిస్‌ చంద్రకుమార్‌ వివరించారు. ఒకవేళ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయని పక్షంలో.. ఈ అంశంపై సుప్రీంకోర్టు తలుపు తట్ట వచ్చని ఆయన స్పష్టం చేశారు. జేఎన్‌జే సొసైటీకి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా సుస్పష్టంగా ఉందని, ఈ స్థలాల్లో మూడోపార్టీ జోక్యం లేదని తీర్పులో స్పష్టంగా ఉందని చెప్పారు. సభ్యులు ఈ స్థలాలను డబ్బులు పెట్టి కొన్నందున ఈ స్థలాలపై సర్వ హక్కులు వారికే చెందుతాయన్నారు. ప్రభుత్వ వర్గాలు ఈ స్థలాలను అప్పగించని సందర్భంలో ప్రజాస్వామ్య యుతంగా నిరహారదీక్షలు చేయాలని సూచించారు. ఆ దీక‌్షల్లో తానూ కూడా పాల్గొంటానని చెప్పారు. సభ్యులు న్యాయపరమైన అంశాలపై అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. జర్నలిస్టులు సమాజంలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు అడ్వకేట్‌ రామచంద్ర రావు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థలాలను జేఎన్‌జే హౌసింగ్‌ సొసైటీకి అప్పగించాలని అన్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అప్పగించని సందర్భంలో సొసైటీ సభ్యులకు కోర్టుల్లో న్యాయ సాయంతోపాటు అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. సభ్యులు రూ.2 లక్షల చొప్పున రూ.12.33 కోట్లు ప్రభుత్వానికి చెల్లించినందున 70 ఎకరాల స్థలం జర్నలిస్టులకే చెందుతుందని అన్నారు. అందరి సమస్యలను ప్రజా బాహుళ్యంలోకి తెచ్చే జర్నలిస్టులకు దేశ అత్యున్నత న్యాయస్థానం వెన్నుదన్నుగా నిలిచిందన్నారు. సుప్రీం తీర్పు ప్రకారం పేట్‌ బషీరాబాద్‌ లోని 38 ఎకరాల స్థలాన్ని వెంటనే సొసైటీకి స్వాధీనం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

సమావేశానికి అధ్యక్షత వహించిన జేఎన్‌జే సొసైటీ వ్యవస్థాపక సభ్యుడు పీ వీ రమణారావు మాట్లాడుతూ.. స్థలాల సాధనకు న్యాయ పరమైన చర్యలు తీసుకుంటున్నామని, కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేస్తామని తెలిపారు. అలాగే నిరసనలు, రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, రిలే నిరాహార దీక్షల ద్వారా ఆందోళన ఉధ్రుతం చేస్తామని తెలిపారు. సమావేశంలో తొలుత మరణించిన సభ్యులకు నివాళులర్పించారు. వారి ఆశయ సాధనకు కృషి చేస్తామని సభ్యులంతా ప్రతిజ్ఞ చేశారు.

సభలో సభ్యులు ‘సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తమ సొసైటీకి పేట్‌ బషీరాబాద్‌లోని 38 ఎకరాల స్థలం ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేయాలని, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకపోవడం వల‍్ల సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయాలని ఏకగ్రీవంగా తీర్మానాలు ఆమోదించారు. ఇంకా రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, రిలే నిరాహర దీక‌్షలు చేపట్టాలన్న తీర్మానాలకు ఆమోదం తెలిపారు.

సభకు దాదాపు 500 మంది సభ్యులు హాజరై స్థలాలను సాధించుకోవడానికి చేపట్టాల్సిన ఆందోళనపై తమ విలువైన సూచనలు చేశారు. సభలో సభ్యులు బోడపాటి శ్రీనివాస్‌, షరీఫ్‌, అశోక్‌ రెడ్డి, రమేశ్‌ బాబు, నర్సింగ్‌, తాతా శ్రీనివాస్‌, అంజూమ్‌ మాట్లాడారు. భూషణ్‌ వందన సమర్పణ చేశారు. ఈ సమావేశం అనంతరం జేఎన్‌జే సొసైటీ సభ్యులు సుందరయ్య పార్కు చుట్టూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని, తమ భూమిని తమకే అప్పగించాలనే నినాదాలతో సభ్యులు హోరెత్తించారు

Share this Article